దుండిగల్, సెప్టెంబర్ 3 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి-నిజాంపేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్ఆర్ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల భవనం సెల్లార్లోకి సోమవారం అర్ధరాత్రి వరదనీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 500 మంది వరకు చదువుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలతో వరదనీరు సెల్లార్లోకి చేరింది.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్చార్జి అధికారి సుకృత, టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి ప్రశాంతి, బాచుపల్లి పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. సెల్లార్‌ను డైనింగ్గా వినియోగించడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. సెల్లార్లోకి అధికంగా నీరు చేరడం, ఐదు అంతస్తులు ఉన్న ఈ భవనం పిల్లర్లు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు కళాశాల సెల్లార్‌ను సీజ్ చేశారు. విద్యార్థులను ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఫంక్షన్హాల్లో బస చేయించారు. మంగళవారం నుంచి కళాశాల యాజమాన్యం నిరవధిక సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోయారు.
పత్తికుంట చెరువు బఫర్‌జోన్‌లో పంచాయతీ అనుమతులతో నిర్మించిన ఈ భవనంపై మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. అనుమతులు లేకుండానే సెల్లార్ నిర్మాణం, జీ+2కు అనుమతులు పొంది జీ+4 నిర్మించడంతో క్లియరెన్స్ రాకపోవడంతో కొంతకాలం ఖాళీగా ఉంది. ఏడాదిన్నర కాలంగా ఇందులో ఎస్ఆర్.జూనియర్ కళాశాల పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలను అధికారులు సీజ్ చేయగా విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
బాచుపల్లిలోని పత్తికుంట చెరువు ఎఫ్టీఎల్/బఫర్‌జోన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలు తొలగించి చెరువును కాపాడాలని మంగళవారం హైడ్రా కమిషనర్‌ను నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రమణి మల్యాల కోరారు. 10 ఎకరాల్లో విస్తరించిన చెరువులో నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురైందని, అందులో ఎస్ఆర్ కళాశాల, శ్రీరామ్ బిజినెస్ స్కూల్ భవనాలు, సప్తపది ఫంక్షన్ హాల్ వంటివి ఎఫ్టీఎల్/బపర్ జోన్ పరిధిలోకి వస్తాయని ఆమె ఆరోపించారు.