చాంద్రాయణగుట్ట ఏప్రిల్ 24 : ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణ గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బాలికను కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు వివరాలను గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఆగ్నేయ మండల డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్, ఏసీపీ మనోజ్ కుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్ లతో కలిసి వివరాలను వెల్లడించారు.
పాతబస్తీ సలీంనగర్లో నివసించే సయ్యద్ జావిద్ పాషా (51), శాయిస్త పర్వీన్ (40) భార్యభర్తలు. వీరిద్దరూ కలిసి ఈ నెల 20వ తేదీన చాంద్రాయణగుట్టలో ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత బాలికను ఉప్పల్‌లో నివసించే పర్వీన్‌కు 1.30 లక్షలకు విక్రయించారు. అయితే బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పోలీసులు విచారించగా.. సుజాత, రాజేంద్ర ప్రసాద్ సహాయంతో పాపను కిడ్నాప్ చేసి, ఉప్పల్‌లో విక్రయించినట్లు నిందితులు వెల్లడించారు. సుజాత, రాజేంద్రప్రసాద్‌లో ముంబైలో కూడా ఇలాగే చిన్న పిల్లల విక్రయం కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు.. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.