సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్తి కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏపీకే ఫైల్‌ను తమ ఫోన్లో ఇన్స్టాల్ చేయడంతో రూ.1.72లక్షలు కోల్పోయాడు. మరో కేసులో 44ఏళ్ల వ్యక్తి ఎంపరివాహన్ లింక్ క్లిక్ చేయడంతో అకౌంట్ నుంచి రూ.2.24లక్షలు పోయాయి.
ఇంకొక కేసులో నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన 38ఏళ్ల వ్యక్తి ఇన్సూరెన్స్ డియాక్టివేషన్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేసి రూ.1.09 లక్షలు కోల్పోగా, మరో వ్యక్తి రూ. 1.24లక్షలు కోల్పోయారు. ఇక యూనియన్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేసిన 68ఏళ్ల నగరవాసి తన అకౌంట్ నుంచి రూ.10లక్షలు కోల్పోయినట్లు సైబర్ పోలీసులు తెలిపారు. ఈ నేరాలన్నిటిలోనూ ఏపీకే ఫైల్స్ కీలకంగా ఉన్నాయని, సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలను అవకాశంగా చేసుకుని ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
వెంటనే 1930కు కాల్ చేయాలి..
మొబైల్‌కు ఏదైనా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్ వచ్చిందని గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. త్వరపడి ఆ ఫైల్‌పై క్లిక్‌చేస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న అంశాల ఆధారంగా నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను తయారుచేసి వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా హ్యాండిల్స్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. పీఎం కిసాన్, ఆర్టీఏ, ఆపరేషన్ సిందూర్ వంటివాటితో పాటు బ్యాంకులకు సంబంధించిన ఏపీకే ఫైల్స్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇవి తెరిస్తే మొబైల్లో ఉన్న సమాచారమంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని సైబర్‌క్రైమ్ పోలీసులు చెప్పారు. సోషల్‌మీడియాలో వచ్చే ఏపీకే లింకులను ఎట్టి పరిస్థిల్లోను క్లిక్ చేయవద్దని గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఎథికల్ హ్యాకర్స్ చెబుతున్నారు. అయితే ప్లే స్టోర్‌లోనూ కొన్ని యాప్‌లు సైబర్ నేరగాళ్లు సృష్టించినవి ఉన్నాయని వాటి గురించి తెలుసుకున్న తర్వాతే ఇన్స్టాల్ చేయాలని వారు సూచించారు. అదే సమయంలో తమ డబ్బులు పోయినట్లు గుర్తించగానే వెంటనే 1930కు కాల్చేయాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచించారు.
ఏపీకే ఫైల్స్‌లో రూ. 4 లక్షలు మాయం
ఓ వ్యాపారి సెల్ఫోన్లో ఉన్న ఏపీకే ఫైల్స్ అతడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేశాయి. మల్కాజిగిరికి చెందిన బాధితుడికి సంబంధించిన యూనియన్ బ్యాంకు ఖాతాతో పాటు అతడి క్రెడిట్ కార్డుల నుంచి తెలియకుండా రూ. 4 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు విత్ డ్రా చేశారు. ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సెల్ఫోన్లో గుర్తుతెలియని యాప్స్ ఉన్నాయా అనే అనుమానంతో పరిశీలించాడు. ఫోన్లో ఆర్టీఓ చలాన్ ఏపీకే, పీఎం కిసాన్ యోజన క్యూ09, ఏపీకే, పీఎం కిసాన్ యోజన, ఏపీకేలు ఉండడం చూసి షాక్ అయ్యాడు. తనకు తెలియకుండానే తన ఫోన్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అయ్యాయని, వాటి ద్వారా రూ. 4 లక్షలు బ్యాంకులో ఉన్న నగదు మాయమయ్యిందంటూ రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.