Hyderabad | హైదరాబాద్ : సైదాబాద్ జైల్ గార్డెన్‌లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
16 నుంచి 17 ఏండ్ల వయసున్న ఓ ఐదుగురు బాలురు ఈ నెల 21వ తేదీన రాత్రి జువైనల్ హోంలోని గ్రౌండ్ ఫోర్లో భోజనం చేశారు. అనంతరం ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లారు. ఇక అధికారుల కంట పడకుండా.. అక్కడున్న ఇనుప గ్రిల్స్‌కు ఉన్న తాళాన్ని తొలగించారు. ఆ తర్వాత ఐదుగురు బాలురు అక్కడ్నుంచి బయటకు దూకి పరారీ అయ్యారు.
ఐదుగురు బాలుర అదృశ్యంపై మిగతా బాలురు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ ఆ ఐదుగురి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఉదయం సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. ఐదుగురిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఏపీకి చెందిన వారని జువైనల్ హోం అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారైన బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.