చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 24: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరి వద్ద నుంచి బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తూర్పు దక్షిణ మండల డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాశ్, ఏసీపీ మనోజ్‌కుమార్, సీఐ గురునాథ్లతో కలిసి వివరాలను వెల్లడించారు.
పాతబస్త్తీ సలీంనగర్లో నివసించే సయ్యద్ జావిద్ పాషా(51), శాయిస్త పర్వీన్(40)భార్యాభర్తలు. వీరు ఈనెల 20వ తేదీన చాంద్రాయణ గుట్ట భ్రమరాంబ వయసు సమీపంలో బాలిక(5)ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ బాలికను ఉప్పల్‌లో నివసించే పర్వీన్ రూ.లక్ష 30వేలకు విక్రయించారు. బాలిక కిడ్నాప్‌పై ఫిర్యాదు అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా గురువారం కిడ్నాప్‌నకు పాల్పడ్డ జావీద్, శాయిస్త పర్వీన్ దంపతులను పట్టుకున్నారు.
వీరు ఇచ్చిన సమాచారంతో పాపను కొనుగోలు చేసిన పర్వీను, పాపను అమ్మడంలో పాలుపంచుకున్న సుజాత, రాజేంద్రప్రసాద్‌ను కూడా పట్టుకున్నారు. సుజాత రాజేంద్రప్రసాద్‌లు ముంబైలో కూడా చిన్న పిల్లల విక్రయంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఐదుగురిని పట్టుకున్న పోలీసులు, వీరి వద్ద నుంచి బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు కేసు దర్యాప్తులో ఉంది. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు.