సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈనెల 1నుంచి వారం రోజులపాటు స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నగరంలోని వేర్వేరు చోట్ల నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్, గంజాయి, గంజాయి మొక్కలు, నల్లబెల్లంను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ రసూల్‌పుర ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు తన బృందంతో కలిసి బేగంపేట-రసూల్‌పురా ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో అక్కడి నుంచి రోహిత్ శర్మ, భావేశ్లు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం నిందితుల వాహనా న్ని ఆపి, తనిఖీ చేయగా వారి వద్ద 1.60గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచా రించగా రసూల్‌పురా ప్రాంతంలో సోను అనే వ్యక్తికి డ్రగ్స్ ఇవ్వడా నికి వెళ్తున్నట్లు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారం గా సోనును సైతం అదుపులోకి తీసుకుని మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1.60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
4080కిలోల నల్లబెల్లం పట్టివేత..
నగరం నుంచి భారీగా నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 4080కిలోల నల్లబెల్లం, 100కిలోల ఆలంతో పాటు డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే….నగరం నుంచి నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజక వర్గం ప్రాంతంలోని సత్తాపూర్ పెద్దకొత్తపల్లి మార్గంలోని తండాలకు కొందరు నల్లబెల్లం తరిలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ సీఐ భిక్ష్మారెడ్డి, బాలరాజ్ల బృందం అటుగా వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఆపి, తనిఖీ చేయగా, పెద్ద ఎత్తున నల్ల బెల్లం, గుడంబా తయారీకి వినియోగించే ఆలం బయట పడింది. దీంతో వ్యాన్ డ్రైవర్ ఖాసింను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 4080కిలోల నల్లబెల్లం, 100కిలోల ఆలంను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో…
భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శనివారం ఉదయం ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు బృందం, రైల్వే పోలీసులతో కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 6.150 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకు న్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన నిందితులు గంజాయిని వదిలి వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
సరూర్‌నగర్‌లో గంజాయి మొక్కలు
సరూర్‌నగర్ గుర్రంగడ్డలోని ఒక వ్యక్తి నివాస ప్రాంతంలో గంజాయి మొక్కలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సరూర్‌నగర్ డీటీఎఫ్ పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు గంజాయి మొకలను గుర్తించి.. ధ్వంసం చేశారు.