భూముల విలువను పెంచనున్న నేపథ్యంలో ఔటర్ లోపలి రిజస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకే చోటకు మార్చాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కోహెడలో నిర్మించాలని యోచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోగల భూముల మార్కెట్ విలువలను పెంచడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రతిపాదనలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం గజానికి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు మాత్రమే ఉన్నది. బహిరంగ మార్కెట్లో మాత్రం వీటి పరిధిలో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతమున్న మార్కెట్ విలువకు మూడింతలుగా పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
– రంగారెడ్డి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)
తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని కోహెడ గ్రామంలో సర్వే నం.167లో ఐదెకరాల స్థలాన్ని ఈ కార్యాలయాల నిర్మాణానికి గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్‌తో కలిసి ఈ స్థలాన్ని ఇప్పటికే రెండుసార్లు పరిశీలించారు. ఈ స్థలం అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని అధికారులు నిర్ణయించారు.
ఈ స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని దాదాపుగా ఖరారు చేశారు. ఈ కార్యాలయాలను అత్యాధునిక హంగులతో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. సత్వరమే రిజిస్ట్రేషన్లు కావడంతోపాటు క్రయవిక్రయదారులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని యోచిస్తున్నది. ఇప్పటికే ఆయా మోడల్స్‌ను పరిశీలించిన సర్కారు త్వరలోనే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
తీరనున్న ఇబ్బందులు
ఔటర్‌లోపల గల వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ల పరిధిలో ప్లాట్లు, భూముల క్రయవిక్రయాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజూ వందలాది రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఎలాంటి సౌకర్యాలు లేవు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి.
వనస్థలిపురం రిజిస్ట్రేషన్ కార్యాలయం విజయవాడ రహదారికి పక్కనే ఉండటంతో ఎలాంటి పార్కింగ్ సౌకర్యంలేదు. పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఎలాంటి వసతులు లేవు. ఇరుకు గదుల్లో కార్యాలయాలుండటం వలన కొన్నికొన్ని సందర్భాల్లో కాలుపెట్టే పరిస్థితి కూడా లేకుండా తయారైంది. ఈ పరిస్థితిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పలువురు భావిస్తున్నారు.