సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం నీరుగారిపోయేలా ఉంది. ఒకే పిల్లర్‌పై రెండు రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడం వలన నిర్మాణ భారం, స్థల సేకరణ వ్యయం తగ్గి, తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే లక్ష్యంతో డబుల్ డెక్కర్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ ప్రతిపాదించింది.
అందుకు అనుగుణంగానే డబుల్ డెక్కర్ డిజైన్లు ఖరారు చేస్తే… ఇప్పుడే మెట్రో సంస్థ పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా… ఎలివేటెడ్ డిజైన్లు ఖరారు కాకుండానే కొట్టుమిట్టాడుతోంది. ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ఒకేసారి రెండు రవాణా వ్యవస్థలను వచ్చేలా డిజైన్ చేశారు. కానీ తరుచు ఏర్పడుతున్న అడ్డంకులు ఆ ప్రాజెక్టు భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దీంతో దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు తమ ప్రాంతానికి వస్తుందో లేదోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.