సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహన్ సారథి పోర్టల్ సేవలు ప్రారంభమైన తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాలుగు దరఖాస్తులు మాత్రమే పరిశీలనకు వచ్చాయి. కాగా సికింద్రాబాద్‌లో తొలిసారి వాహన్ సారథి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికి సారథి పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నా.. ఓటీపీ రావాలన్నా..ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అటు అధికారులు సైతం ప్రాసెస్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో అరగంట నుంచి గంట వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనూ సారథి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో వారం రోజుల్లో నగరమంతా సారథి పోర్టల్‌లో సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.