Hyderabad | హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్లోని కింగ్ ప్యాలెస్లో ‘ఆనం మీర్జా’ ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఒక దుకాణదారుడు తన దగ్గర ఉన్న తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్ధం రావడంతో ఎక్స్పోకు వచ్చిన సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు.
కాల్పులు జరగడంతో ఉలిక్కిపడ్డ సందర్శకులు ఎక్స్పో నుంచి బయటకు పరుగులు తీశారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎక్స్పోకు చేరుకుని.. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.