జీడిమెట్ల, నవంబర్ 26: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో పరిశ్రమలోని మూడు ఫోర్లు మంటల్లో తగలబడిపోయి మంటల తాకిడికి భవనం కూలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పరిశ్రమకు చెందిన ముడి సరుకులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండటంతో యాజమాన్యం వాటిని వీలైనంత మేర వేరే చోటుకు చేరవేసింది. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్-5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.
పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకుని రెండు ఫ్లోర్లు ఉండగా.. ఆ పైన పెద్ద రేకుల షెడ్డును నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. మంగళవారం జనరల్ షిఫ్ట్ లో సుమారు 200 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ 3వ అంతస్తు రేకుల షెడ్డులో కొంత మంది కార్మికులు ఆర్.పి. (రీప్రాసెసింగ్ ) మిషన్ వద్ద పనులు నిర్వహిస్తున్నారు. సరిగ్గా 12:30 గంటలకు రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు.
వెంటనే పరిశ్రమ సిబ్బంది జీడిమెట్ల అగ్ని మాపక కార్యాలయానికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బందికి 3వ అంతస్తుకు నీటిని చిమ్మడం కష్టంగా మారింది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అంటుకున్నాయి. ఫైర్ అధికారి శేఖర్‌రెడ్డి ప్రమాద తీవ్రతను పైఅధికారులకు తెలుపడంతో కూకట్పల్లి 2, సికింద్రాబాద్ 2, సనత్‌నగర్ 1, కూకట్పల్లి 2, మాదాపూర్ 1, జీడిమెట్లకు చెందిన మరో రెండు వాహనాలు కలిపి మొత్తం 8 వాహనాలు పరిశ్రమ వద్దకు తెప్పించారు. దాదాపు ఐదు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
పరిశ్రమలో ప్లాస్టిక్ అంటుకోవడంతో తీవ్రమైన నల్లటి పొగలు పెద్దఎత్తున వెలువడ్డాయి. దీంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి నీరు కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఫైర్ ఆఫీసర్లు, సిబ్బంది నల్లటి పొగలతో చాలా ఇబ్బంది పడుతూ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నించారు. జీడిమెట్ల మాజీ ఐలా చైర్మన్ రామకృష్ణ, జేఐఏ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని వివిధ ప్రాంతాల నుంచి నీటి ట్యాంకులను తెప్పించడంతోపాటు ఫైర్ సిబ్బందికి ఆహారాన్ని అందజేశారు. మూడవ అంతస్థు లోపలికి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో ఫైర్ అధికారులు బ్రాంటో స్కైలిఫ్ట్ తెప్పించి దానితో లోపలికి నీటిని చిమ్మారు. ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాద స్థలాన్ని డీఎఫ్ఓలు జయకృష్ణ, త్రిదాసా, బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్‌లతో పాటు వివిధ విభాగాల అధికారులు సందర్శించారు.