పెద్దఅంబర్‌పేట, జనవరి 7: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారంలోని హరిణవనస్థలి అటవీ ప్రాంతంలో(Harina Vanasthali) మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం(Fire accident) చోటుచే సుకున్నది. ఫతుల్లాగూడలోని ముక్తిఘాట్‌కు ఎదురుగా ఉన్న అటవీప్రాంతం వెంట వాహనదారులతోపాటు సమీపంలోని పలువురు ఇండ్ల యజమానులు చెత్తచెదారాలను వేస్తున్నారు. పాడయిన వస్తువులు, సోఫాలు తదితర పనికిరాని వాటిని అటవీప్రాంతంలోకి విసిరేస్తున్నారు. ఎవరైనా సిగరెట్ తాగి పడేయడం వల్ల లేదా చెత్తను తగలబెట్టే క్రమంలో మంటలు చెలరేగినట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు.
గంట వ్యవధిలోనే మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. కొంత అటవీ ప్రాంతంలోకి విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపకశాఖ, నాగోల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సాగర్ పర్యవేక్షణలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు చెత్తను అటవీప్రాంతానికి ఆనుకుని పడేస్తున్నారని, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చని పేర్కొన్నారు. చలికాలం కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందలేదు. అదే ఎండాకాలం అయి ఉంటే పెను ప్రమాదమే జరిగేది. జింకలు, నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు తదితర జంతు సంపదకు నిలయమైన వణ్యప్రాణులకు నెలవైన హరిణవనస్థలి అటవీ ప్రాంతం సంరక్షణపై అధికారులు సైతం శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.