సిటీబ్యూరో/చార్మినార్/సైదాబాద్/జియాగూడ/హిమాయత్‌నగర్/అబిడ్స్ : పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీకృష్ణ పెరల్స్ దుకాణ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి.. 17 మంది మృత్యువాతపడ్డారు. ఏసీ కంప్రెషర్ పేలి.. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. సిలిండర్ కూడా పేలిపోవడంతో ప్రమాద తీవ్ర మరింత పెరిగింది. ఇరుకైన మార్గం ఉండటంతో.. పలువురు ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే అవకాశం లేక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
ఇరుకు మార్గం.. అందని సహాయం..!
శ్రీకృష్ణ పెరల్స్ దుకాణం నడుపుతున్న భవనం బయట నుంచి చూస్తే పూర్తిగా ఇరుకైనదిగా కనిపిస్తుంది. లోపలికి వెళ్లే క్రమంలో పై అంతస్తులకు వెళ్లాలంటే ఒక ఫీట్ కూడా ఉండని మెట్ల మార్గం నుంచి ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లాలి. సమూహంగా లోపలికి పోవడానికి అవకాశమే లేదు. అయినా రెస్క్యూ బృందాలు పక్క భవనాల నుంచి నిచ్చెన వేసుకుని పైనుంచి గేట్లను పగులగొట్టి లోపలికి పోయాయి. పైన కూడా లోపలికి దిగడానికి ఒక్క మనిషి మాత్రమే వెళ్లే మార్గం ఉండడంతో గోడలను కూలగొట్టారు.
చిన్నగా మొదలై..
పూర్తిగా ఇరుకైన ఇల్లు.. బయటకు చూడడానికి ఒకలాగా.. లోపల మాత్రం మరొకలాగా కనిపించే ఆ భవంతిలో ఏ చిన్న ప్రమాదం జరిగినా బయటకు రావడానికి అవకాశమే లేదు. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ ప్రాంతంలో గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీ లు శ్రీకృష్ణ పెరల్స్ పేరుతో ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార సముదాయంపై నివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నగా మొదలైన మంటలు చూస్తుండగానే పెద్ద అగ్నికీలలుగా మారి పై అంతస్తు వరకు జ్వాలలు ఎగిసిపడ్డాయి. రెండో అంతస్తులోని నలుగురు యువకులు మంటల తీవ్రతను గుర్తించి ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే అప్రమత్తమై కిందికి దూకేశారు.మొత్తం 21 మంది ఉన్న భవంతిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు.
లోపలికి వెళ్లేందుకు..
ఇరుకైన మార్గమే 17 మంది ప్రాణాలు బలిగొందని అగ్ని మాపక అధికారులు చెప్పారు. మొదట సదరు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు మొదలయ్యాయి. ఏసీ కంప్రెషర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అంతేకాకుండా భవనంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి సీలింగ్ పై భాగంలో డెకోలం రూఫింగే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు షాపులోని, ఇంట్లోని ఉపకరణాలను దహించి వేయడంతో పెద్ద ఎత్తున పొగ వచ్చి మంటలలో చిక్కుకున్న వారు ఉక్కిరిబిక్కిరయ్యారు.
నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ఎవరికి వారు బయటకు రాలేక, లోపల ఉండలేక నరకయాత పడ్డారని మృతుల బంధువులు అధికారులకు చెప్పారు. మరోవైపు భవంతి కింద ఫ్లోర్లో మెయిన్ వద్ద తరచూ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతున్నట్లు తాము సమాచారమిచ్చినా యజమాని కానీ, విద్యుత్ సిబ్బంది కానీ పట్టించుకోలేదని కార్మికులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్లో నిర్విరామంగా నడిచిన ఏసీ కంప్రెషర్ వద్ద అధికంగా వేడి ఉత్పత్తై అగ్నిప్రమాద తీవ్రత పెంచడానికి కారణమైందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సిలిండర్ సైతం అగ్నికీలలకు పేలిపోయి ప్రమాద తీవ్రతను మరింత పెంచింది.
ఆహుతైన రెండో అంతస్తు
అగ్నిమాపక సిబ్బందికి లోనికి వెళ్లడానికి బాధితులను రక్షించడానికి సరైన మార్గం లేకపోవడంతో కీలకమైన సమయం వృథాగా మారిపోయింది. రెండో అంతస్తు నుంచి గోడను తొలగించి అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే రెండో అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా మొదటి అంతస్తులో మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులు మొత్తం అపస్మారక స్థితికి చేరుకున్న విషయాన్ని గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే వారిని రక్షించడానికి భుజాలపై మోస్తూ కిందికి తరలించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడానికి వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను కొనసాగించారు.
ఆస్పత్రికి తరలించినా..
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఐదుగురు హైదర్‌గూడలోని అపోలో చికిత్స పొందుతూ చనిపోయారు. అలాగే ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని మలక్‌పేటలోని యశోద వైద్యశాలకు తీసుకురాగా, వారు అప్పటికే చనిపోయారు. మరో ఇద్దరు చిన్నారులను కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలోకు తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
ఉస్మానియాలో పోస్టుమార్టం
మృతదేహాలకు ఉస్మానియా వైద్యశాలలో పోస్టుమార్గం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉస్మానియా వైద్యశాల వద్దే ఉండి పరిస్థితి సమీక్షించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ మహమూద్ అలీ పరామర్శించారు.
బాధితులను పరామర్శించని సీఎం
గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద భారీ అగ్నిప్రమాద ఘటన జరిగి 17 మంది అమాయకులు చనిపోతే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉండి బాధితులను పరామర్శించకపోవడం బాధాకరం. సుదూరం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ కాల్ చేస్తే హైదరాబాద్‌లోనే కూర్చున్న ముఖ్యమంత్రికి బాధితులను పరామర్శించడానికి తీరిక లేకపోవడం విడ్డూరంగా ఉంది. కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండీ కూడా గుల్జార్‌హౌస్ ఘటనా స్థలిని సందర్శించకపోవడం శోచనీయం. గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన ఘటన అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు.
-బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్‌రావు