హిమాయత్‌నగర్,జూన్20 : విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి హాలిడే బజార్ ట్రావెల్ సంస్థ కార్యాలయంలోని ఫర్ని చర్, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్, సంస్థ ప్రతినిధులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో నివాసం ఉండే అశోక్ గత పది ఏండ్లుగా హిమాయత్ నగర్ వీధి నెం 2లో ఉన్న ఓ భవనంలోని మూడో అంతస్తులో హాలిడే బజార్ ట్రావెల్ కార్యాలయంను ఏర్పాటు చేశారు.
సోమవారం కార్యాలయం లోపలి నుంచి ఆకస్మాతుగా మంటలు వచ్చి దట్టంగా పొగలు కమ్ము కున్నాయి. స్థానికులు గమనించి వెంటనే 100 కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో నారాయణగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బందిని రప్పించి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయించారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల విలువైన 28 కంప్యూటర్స్, 6ల్యాప్‌టాప్‌లు,11 ఏసీలు, రెండు సెల్‌ఫోన్స్, ఫర్నిచర్ తదితర వస్తువులు దగ్దమైనట్లు మేనేజర్ రాము తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.