Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని తాజ్‌మహాల్ హోటల్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్‌లో మంటలు చెలరేగినట్లు ఆ హోటల్ యజమాని తెలిపాడు.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం అర్ధరాత్రి హోటల్‌ను మూసే ముందు కిచెన్‌లో నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది తమ యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. కాసేపటికే మంటలు చెలరేగాయి. అంతలోపే కిచెన్‌లో ఉన్న సిలిండర్లను సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అయితే సిలిండర్లను బయటకు తీసుకురావడంతో.. ప్రమాద తీవ్రత తగ్గిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో హోటల్లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పోలీసులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.