PVNR Express Way | హైదరాబాద్ : అంబర్‌పేట ఫ్లై ఓవర్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్.. క్షణాల్లోనే కారులో నుంచి కిందకు దిగేశాడు. దీంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 211 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అగ్నిప్రమాదానికి గురైన కారు నంబర్ – ఏపీ 28 డీవీ 3696. డ్రైవర్ ప్రాణాలతో బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.