Krishna Water | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటిపండు పడిందంటే ఇదేనేమో. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలతో భారీగా పెరిగిన నీటి వినియోగం… మరోవైపు పెద్ద ఎత్తున ఒట్టిపోయిన బోర్లు… వెరసి హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా డిమాండుకు అనుగుణంగా లేదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా జలాల సరఫరా వ్యవస్థలో అత్యంత కీలకమైన కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రంలోని 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఇంతటి ఉష్ణోగ్రతల్లో విద్యుత్ సబ్స్టేషన్లలో సమస్య తలెత్తడం సహజమైనప్పటికీ… 24 గంటల పాటు నగరానికి నిరంతరంగా మూడు పైపులైన్లలో నీళ్లు వస్తున్నా.. సరిపోవడం లేదు.. అలాంటిది ఏకంగా ఆరు గంటల పాటు అంతరాయం కలగడమంటే సరఫరా వ్యవస్థ గాడి తప్పుతుంది. రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో శనివారం ఆ ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ ఆది, సోమవారాల్లో మాత్రం నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నట్లు తెలుస్తున్నది. సమస్య మరింత జఠిలం కాకుండా జలమండలి అధికారులు స్థానిక నాయకులతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు.
మహా నగరంలో మంచినీటి సరఫరా కోసం జలమండలి ఐదు నీటి వనరుల ద్వారా రోజుకు సుమారు 560 మిలియన్ గ్యాలన్ల జలాల సరఫరా జరుగుతున్నది. అందులో కృష్ణా నది నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు అంటే దాదాపు 48 శాతం వరకు వస్తున్నాయి. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొని… కోదండాపూర్ వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రంతో పాటు మరో మూడు దశల్లో శుద్ధి కేంద్రాల్లో కూడా శుద్ధి చేసి నగరానికి మంచినీటిని తరలిస్తున్నారు. కోదండాపూర్ ప్లాంటు నుంచి మూడు పైపులైన్ల ద్వారా జలాల తరలింపు జరుగుతున్నది. అయితే అత్యంత కీలకమైన కోదండాపూర్ ప్లాంటులోని 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శనివారం ఉదయం సుమారు ఆరు గంటలకు సాంకేతిక సమస్య తలెత్తింది. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ బస్, ఐసోలేటర్ విఫలమైంది.
మంటలు వచ్చాయి. దీంతో నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా మూడు పైపులైన్లలో నగరానికి పంపింగ్ ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించగా మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తయినట్లు సీజీఎం దశరధరెడ్డి తెలిపారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు పంపింగ్ మొదలైనట్లు సమాచారం. 6 గంటల పాటు నగరానికి సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 60-70 మిలియన్ గ్యాలన్ల కొరత ఏర్పడినట్లు అంచనా. ఇది ఒకరోజు నగరానికి అందాల్సిన కృష్ణా జలాల్లో 22-25 శాతం వరకు ఉంటుంది. కాగా, సాయంత్రం వరకు జలాల తరలింపు సాధారణ స్థితికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతున్నది. దీనికి తోడు మహా నగరవ్యాప్తంగా వేలాది బోర్లు ఎండిపోయాయి. ప్రజలు జలమండలి సరఫరా చేసే నీటితో పాటు ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. రోజు విడిచి రోజు జరిగే నీటి సరఫరా ఇప్పుడు ప్రాంతాల వారీగా 3-5 రోజులకోసారి జరుగుతున్నది. డిమాండు పెరిగిన దృష్ట్యా మునుపటికంటే తక్కువ సమయానికే సరఫరాను పరిమితం చేశారు.
ప్రజలు ఎంత పొదుపుగా నీటిని వాడుకుంటున్నప్పటికీ అవసరాలు తీరడం లేదు. ఈ క్రమంలో కృష్ణా జలాల సరఫరాకు అంతరాయం కలగడం ఆందోళన కలిగించే విషయం. శనివారం సమస్య తలెత్తినప్పటికీ… ఉదయం ఆరు గంటల వరకు జరిగిన నీటి సరఫరాతో రిజర్వాయర్లలో నిల్వలు ఉన్నాయి. ఆ నీటినే సరఫరా చేశారు. అయితే ఆరు గంటల పాటు సరఫరా నిలిచిపోవడంతో సాయంత్రం నుంచి అనేక ప్రాంతాలకు నీటి సరఫరా జరగలేదు. ఆది, సోమవారాల్లో కూడా నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.