హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని దివాన్‌దేవిడిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులోని బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడు, రెండో అంతస్తులకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసి పడటంతో పక్కనే ఉన్న బట్టల దుకాణాలకు సైతం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. 40కిపైగా టెక్స్టైల్స్ షాపులు కాలిబూడిదైనట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే అన్నీ బట్టల దుకాణాలే కావడంతో మంటలు అదుపులోకి రావడంలేదు. దీంతో ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వస్తున్నది. రాత్రి 1.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని, తమకు 2 గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.