హైదరాబాద్: హైదరాబాద్ షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పరిధిలోని ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉన్న జుహి ఫెర్టిలిటీ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్లో మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే భారీగా పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో నిచ్చెన సాయంతో పైకిఎక్కి ఫెర్టిలిటీ సెంటర్ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అతికష్టం మీద మంటలను అదుపుచేయగలిగారు. అయితే అదే బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌కు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడ్డారు. అదేవిధంగా పక్కనే బాయిస్, గల్స్ హాస్టల్స్ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారందరినీ ఖాళీ చేయించారు. కాగా, విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు.