Kokapet | మణికొండ, మార్చి 15 : నగర శివారు ప్రాంతంలోని కోకాపేట ఘర్ బిల్డింగ్‌లోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఘర్( జి అమరేందర్ రెడ్డి) మల్టీ లెవెల్ బిజినెస్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ రెస్టారెంట్ కిచెన్‌లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే పని చేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ మేరకు నార్సింగి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంవి రమణ గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో భారీ అగ్ని ప్రమాదం అంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆసుపత్రికి తరలింపజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు.
కోకాపేటలోని ఘర్ బిల్డింగ్‌లో శనివారం చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటనపై అగ్నిమాపక అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని లీకేజీకి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ మల్టీ లెవెల్ కమర్షియల్ బిల్డింగ్ లో నిత్యం వివిధ రకాల కంపెనీలకు చెంది వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ఇంత భారీ భవనంలో గ్యాస్ లీకేజీ ఏ విధంగా జరిగిందంటూ అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం గ్యాస్ లీకేజీ కి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.