శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20: గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ భవనంలోని సెల్లార్లో ఉన్న ప్యానెల్ బోర్డు వద్ద మంటలు చెలరేగి.. మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ఈ ఘటనలో సెల్లార్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు కాగా మరో 10 మంది పొగ పీల్చుకుని అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 20 ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయా యి. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో జేపీ ప్లాజా భవనం ఉంది. ఈ భవనంలో సింగిల్, డబుల్ బెడ్ రూమ్‌లు 24 ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్‌తో సహా 5 అంతస్తుల ఈ భవనంలో సోమవారం ఉదయం సెల్లార్‌లోని ప్యానెల్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా నిప్పులు ఎగిసిపడి పక్కనే ఉన్న పాత సోఫాలపై పడి మంటలు చెలరేగాయి. ఆ పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాప్తించి దట్టమైన పొగలతో క్షణాల్లో మొదటి అంతస్తు వరకు మెట్ల మార్గంలో వ్యాపించాయి.
దీంతో ఒక్కసారిగా నిద్రలోంచి లేచిన భవన ని వాసితులు బయటకు పరుగు లు తీశారు. అగ్ని ప్రమాదంపై ఫైర్ శాఖకు సమాచారం అందించడంతో మాదాపూర్, వట్టినాగుల పల్లి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటల్లో దాదా పు 20 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న భవన అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న 16 మం ది నివాసితులను క్షేమంగా కిందకు దించి కాపాడారు.
ఏపీ, కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు మండలం, చిన్న గొన్నూరుకు చెందిన గాజుల రాజశేఖర్ బాబు (25) జేవీ ప్లాజా ఫ్లాట్ నంబర్ 202లో నివాసం ఉంటూ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బయటకు వెళ్లాలనే ప్రయత్నంలో మెట్ల వెంట వెళ్తూ దట్టమైన పొగ కారణంగా సరిగ్గా కనిపించకపోవడంతో సెల్లార్ స్టెప్స్ వైపు వెళ్లాడు. మంటలు అంటుకోవడంతో దాదా పు 90 శాతం గాయాలయ్యాయి. రాజశేఖర్ బా బు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉం దని పోలీసులు తెలిపారు.
రాజశేఖర్‌కు పెళ్లి చేసేందుకు కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. కాగా స్వ ల్పంగా కాలిన గాయాలు, పొగను పీల్చడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో డాక్టర్ అమూల్య (34), ప్రణీత్ (22), హర్షిలా, పంకజ్ జిందాల్ (37), సోనమ్ జాడోన్ (35), శిల్పా పాండే (24), ఆది పవన్ కుమార్ (25), అరివ్ కేతన్ (7 నెలలు), రాజేశ్ (24), వెంకట్ (25)లు ఉన్నారు. బాధితులను సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేశ్ పరామర్శించారు.