మెహిదీపట్నం, జూన్ 6: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేసింది. సకాలంలో ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం గురువారం సాయంత్రం హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలోని నాంపల్లి పటేల్‌నగర్ సమీపంలోని సేవక్‌నగర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సేవక్‌నగర్‌లో ఉన్న ఫర్నీచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురై.. హబీబ్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇన్స్పెక్టర్ రాంబాబు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ నుంచి ఫైరింజన్లను రప్పించారు. ఫైరింజన్ వాటర్ పైపులు వెళ్లేందుకు వీలుగా మార్గం లేకపోవడంతో ఇండ్ల పైనుంచి తీసుకెళ్లి మంటలను ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.