Indian Bank | హిమాయత్ నగర్, మే7: నారాయణగూడలోని తాజ్‌మహాల్ హోటల్ సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం విద్యుత్ వైర్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన కస్టమర్లు, సిబ్బంది డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నారాయణగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఒక ఫైరింజన్‌తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో విలువైన కంప్యూటర్లు, ఫైల్స్, ఏసీలు, ఫర్నీచర్ తదితర వస్తువులు కాలి బూడిదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.