అబిడ్స్, మే 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగుల అని కనీస మర్యాద పాటించకుండా అనుచరులతో కలిసి నానా హంగామా చేశారు. అక్రమ నిర్మాణాల అడ్డుకట్ట వేయడంలో తన బాధ్యతను విస్మరించిన జాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్.. తనకే ఎదురు సమాధానం చెప్తారా? అంటూ సహనం కోల్పోయి టౌన్ ప్లానింగ్ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి అన్న కనీస బాధ్యతను మరిచి.. వీధి రౌడీలా వ్యవహరించిన తీరుపై ఉద్యోగ వర్గాలు భగ్గుమన్నాయి.
కార్పొరేటర్ దాడికి నిరసనగా శనివారం రోజంతా విధులను పక్కన పెట్టి కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ అన్ని శాఖల ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సర్కిల్ కార్యాలయాలకు తాళాలు వేసి నినాదాలు చేశారు. ఈ ఘటనను కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ ఆర్ వీ కర్ణన్ దృష్టికి తీసుకువెళ్లగా…సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ స్థానిక అబిడ్స్ ఇన్స్పెక్టర్ను పిలిపించుకుని మాట్లాడారు. కమిషనర్, సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంజుల సింగ్ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
బాధ్యత గల పదవిలో ఉన్న కార్పొరేటర్ విచక్షణ కోల్పోయారు. తన పార్టీ కార్యకర్త అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతుంటే సరిదిద్దాల్సిన కార్పొరేటర్…ప్రభుత్వ ఉద్యోగిపై బెదిరింపులకు పాల్పడ్డారు. 60 గజాల ఇంటి స్థలం విషయంలో అక్రమ నిర్మాణమని ఫిర్యాదు వచ్చిందని, ఫిర్యాదు ఆధారంగా నడుచుకుంటామని సదరు ఉద్యోగి చెప్పిన ఏ మాత్రం కార్పొరేటర్ వినలేదు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో కార్పొరేటర్ సహనం కోల్పోయి సదరు సెక్షన్ ఆఫీసర్‌పై దాడికి దిగారు. దీంతో 14వ సర్కిల్ అధికారులు సిబ్బంది కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు.
వీరికి అంబర్‌పేట సర్కిల్ అధికారులు సిబ్బంది సంఘీభావం తెలిపారు. అధికారులు, కార్పొరేటర్ మనుషులు అబిడ్స్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై దాడికి దిగారని రాజ్ కుమార్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంజుల సింగ్ తన సిబ్బంది, యూనియన్ నాయకులతో కలిసి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించి కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ తమ సిబ్బందిపై దాడికి దిగినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అబిడ్స్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కార్పొరేటర్ దాడిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయానికి చెందిన అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది విధులను బహిష్కరించి కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతోపాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లి అక్కడ కమిషనర్ ఆర్ వీ కర్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఈ విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకునేందుకు నిర్లక్ష్యం వహించారని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ టౌన్‌ప్లానింగ్ ముఖ్య అధికారికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
అబిడ్స్ ఆఫీసులో ఉన్న సర్కిల్ 14,15,16 గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది అంతా ధర్నాకు దిగారు. ఇందుకు మద్దతుగా బీఎంఈయూ యూనియన్ నాయకులు ప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌లు పాల్గొన్నారు. కాగా, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌పై బీజేపీ కార్పొరేటర్ దాడి ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ అయ్యారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిపించుకొని వివరాలు తెలుసుకొని పోలీసులతో మాట్లాడారు.