సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలమీదే ఎక్కువ ప్రభావం చూపుతాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని..ఇలా సామాన్య ప్రజల నుంచి ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు.
ఇటీవల నగరంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో సుమారు 15వేల కేసులు నమోదయ్యాయి. తెలంగాణ డీజీపీ పేరుతో ఉన్న టూవీలర్(TS09 PA6049)పై కూడా చలాన్లు ఉన్నాయంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వాహనంపై ఆగస్టు 2021 నుంచి 17మార్చి 2025 వరకు రూ.2,185 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. పోలీసుల వాహనాలన్నీ డీజీపీ పేరుతోనే ఉంటాయని, పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఉన్నతాధికారులు ఊరుకోరని, ఖచ్చితంగా చర్యలుంటాయని ఓ పోలీస్ అధికారి చెప్పారు.