సిటీబ్యూరో , జూన్ 19 (నమస్తే తెలంగాణ): క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోసే ధోరణికి ముగింపు పలకాలని పురపాలక శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఓపెన్ ప్లాట్లు, రోడ్ల పక్కన నాలాలు, చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాలను పారబోస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ శుక్రవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో నంబర్ 626 జారీ చేశారు.
క్యూర్ పరిధిలో రహదారులు, నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారసే వాహనాల సీజ్, సదరు కాంట్రాక్టర్లు, లేదా ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టడం లాంటి కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. అవసరమైతే పోలీసుల ద్వారా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నారు. అలాగే ఇకపై కొత్త భవనాల నిర్మాణ అనుమతుల సమయంలో సంబంధిత భవనాల ప్లాన్లు, లే అవుట్లు, కూల్చివేతల అనుమతులు పొందాలంటే వ్యర్థాలను చట్ట విరుద్ధం గా పారబోయబోమనే అండర్ టేకింక్, వ్యర్థాల నిర్వహణ ప్లాన్ సమర్పించడం తప్పనిసరి చేసింది.
దీనికి తోడు వ్యర్థాల డిస్పోజల్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ కానున్నాయి. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేసే బాధ్యతను హెచ్ఎండీఏ, హైడ్రా, జీహెచ్ఎంసీ, పీసీబీ, వాటర్ బోర్డు, ఆర్అండ్బీ, గ్రేటర్ డిస్కం అధికారులపై ఉందన్నారు. ప్రస్తుతం అధికారికంగా గుర్తింపు పొందిన శంషాబాద్, తూంకుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్లాంట్‌కు ప్రాసెసింగ్ వ్యర్థాలను తరలించాలని సూచించారు.