హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు పెద్దన్నలాంటి ఉన్నత విద్యామండలికి, జవహార్‌లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఏఎన్ఎఫ్ఏయూ) పొగపెడుతున్నది. తమ మంచిచెడ్డ, బాగోగులు చూసుకోవాల్సిన ఉన్నత విద్యామండలినే వర్సిటీ ఇబ్బందులకు గురిస్తున్నది. ఉద్దేశపూర్వకంగా నీళ్లు వదలడంలేదని.. కరెంట్ పోతే చీకట్లో మగ్గాల్సి వస్తున్నదని మండలి వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా మండలి కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితులను ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ కల్పిస్తున్నదని అంటున్నారు. సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నామని, ఆఫీసును నడపలేకపోతున్నామని కార్యాలయ ఉద్యోగులంటున్నారు. ఈ పరిస్థితులతో ఆఫీసును మరోచోటికి తరలించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మండలి అధికారులు దృష్టిసారించారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలికి మాసాబ్‌ట్యాంక్‌లో కార్యాలయముంది. దశాబ్దాల కాలంగా ఇదే కార్యాలయంలో మండలి నడుస్తున్నది. అయితే ఈ భవనం జేఏఎన్ఎఫ్ఏయూకు చెందినది. ఇదే భవనంలో మండలితో పాటు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ), దోస్త్ కార్యాలయాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భవనానికి అద్దె చెల్లించేవారు.. అప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ భవనాన్ని ఉన్నత విద్యామండలి కొనుగోలు చేసే అంశం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే అయితే ఈ స్థలం వర్సిటీది కాదని, సాంకేతిక విద్యామండలి (ఎస్బీటెట్)కి చెందినన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 1,550 చదరపు గజాల స్థలాన్ని మండలికి కేటాయిస్తూ అప్పట్లో సాంకేతిక విద్యాశాఖ రాతపూర్వకంగా ఉత్తర్వులిచ్చింది. ఈ స్థలాన్ని ఉన్నత విద్యామండలికి కేటాయిస్తూ ఎన్వోసీ హైదరాబాద్ కలెక్టర్‌కు సూచించింది. ఇక భవనాల నిర్మాణ వ్యయం కింద రూ. 6.65కోట్లను ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి చెల్లించాలని సూచించింది.
దీనిని అప్పట్లోనే పైన్‌ఆర్ట్స్ వర్సిటీ అధికారులు వ్యతిరేకించారు. దీంతో భవనం కొనుగోలు అంశం మరుగునపడింది. గత కొంత కాలంగా ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఉన్నత విద్యామండలి ఉద్యోగులంటున్నారు. వర్సిటీ నుంచే తమకు నీళ్లు సరఫరా అవుతాయని. అయితే వర్సిటీ సిబ్బంది నీళ్లు ఆపేస్తున్నారని.. ఉదయం 11 గంటల తర్వాత, అది కూడా తాము అడిగితేనే నీళ్లు విడుదల చేస్తున్నారని, తాము ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాల్సి వస్తుందని, కరెంట్‌పోతే రోజుల తరబడి చీకట్లో ఉండాల్సి వస్తుందని మండలి ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
భవనం విషయంలో ఇబ్బందుల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. మరో చోట ఆఫీసును కేటాయించాలని సర్కారుకు లేఖను రాసింది. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ, రాణిగంజ్‌లోని బుద్దభవన్, పురపాలకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఒక అంతస్తులను అధికారులు పరిశీలించారు. అయితే ఇవేవి అనుకూలం కాదని తేల్చారు.
ఆఖరికి సైఫాబాద్‌లోని హెర్మిటేజ్భవనంలో కొంత భాగాన్ని కొనాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే పార్కింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే వివాదం విషయంపై ఫైన్ఆర్ట్స్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంగాధర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ మండలి కార్యాలయమున్న భవనం తమదేనని, ఈ విషయంలో మండలితో తమకెలాంటి వివాదాల్లేవన్నారు. అయితే నీళ్లు వదలకపోవడం, ఇతర అంశాలేవి తమ దృష్టికి రాలేదన్నారు. ఏదైనా ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామన్నారు.