Financial Offences | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య ఉపాధి కోసం హైదరాబాద్ బీకేగూడకు వచ్చాడు. కూలీపని చేసుకుంటూ చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో అందరికీ ఠంచన్‌గా డబ్బులు ఇచ్చి నమ్మకం కూడబెట్టాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున చిట్టీలు నడుపుతూ రూ.100కోట్ల వరకు వసూలు చేశాడు. తన దగ్గర చిట్టీ ఎత్తిన వారికి ఆ సొమ్ము ఇవ్వకుండా అందుకు వడ్డీ అధికంగా ఇస్తూ నమ్మించాడు. సుమారు 700 మంది పుల్లయ్య మాయలో పడి చిట్టీ డబ్బులు కట్టడం, ఎత్తిన సొమ్ము అతడికే పెట్టుబడిగా ఇవ్వడం చేశారు. చివరకు డబ్బులు అడిగే సమయానికి పుల్లయ్య కుటుంబసభ్యులతో సహా పరారయ్యాడు.
రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలి.. కష్టపడకుండానే జేబులు నిండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన. ఇది ప్రస్తుతం నగరంలో చాలా మంది మోసపోవడానికి కారణమవుతున్నది. గ్రేటర్లో ఈ మధ్య కాలంలో ఆర్థిక నేరాలు పెరగడానికి ఈ ధోరణే కారణమని తేలింది. తేలిగ్గా డబ్బు సంపాదించాలనుకునే వారి బలహీనత నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నది. ఆకర్షణీయమైన వడ్డీలు, అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నేరగాళ్లు దోపిడీకి తెరదీస్తున్నారు. రూ.లక్షకు నెలకు 30శాతం వడ్డీ, 6 నెలల్లో అసలుతో కలిపి ఇస్తామనగానే నమ్మి బాధితులు మోసపోతున్నారు.
బాధితులను నమ్మించేందుకు నిందితులు కొన్ని నెలలపాటు వడ్డీలు, లాభాలు ఠంచన్‌గా ఇస్తారు. ఎక్కువ మంది నిజమేనని నమ్మి తమ బంధువులు, స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టించడంతోపాటు చిట్టీలు వేయిస్తున్నారు. తమకు డబ్బులు కరెక్ట్‌గా వస్తున్నాయని నకిలీగాళ్ల కంటే బాధితులే ఎక్కువగా ప్రచారం చేయడం నిందితుల జేబులు నింపడానికి ప్రధాన కారణమవుతున్నది. దీనిని నమ్మి కొందరు పెన్షన్ డబ్బులు, బంగారం, పెండ్లిళ్లకు దాచుకున్న సొమ్ము సైతం పెట్టుబడుల రూపంలో పెడుతున్నారు. మరికొందరు తమ అవసరాల నిమిత్తం తమకు నిర్వాహకులు తెలియకున్నా దగ్గరి వారిని నమ్మి అక్కడ పెద్ద పెద్ద చిట్టీలు వేస్తున్నారు. అధిక వడ్డీ వస్తే తమకేదైనా లాభం జరుగుతుందేమోనన్న ఆశతో నిలువునా మోసపోతున్నారు.
ఆర్థిక నేరాలకు సంబంధించి కొట్టేసిన డబ్బులతో నేరగాళ్లు ఇతర వ్యాపారాలు చేస్తారు. బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తారు. దీంతో సొమ్ము రికవరీ ఉండటం లేదు. 2024లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,036 కోట్ల ఆర్థిక నేరాలు జరగగా..జప్తు చేసింది కేవలం 324 కోట్లు మాత్రమే. అంటే 30శాతం మాత్రమే రికవరీ చేయగలిగారు.
నగరంలో ఏటా సగటున పది శాతం కంటే ఎక్కువగా ఆర్థిక నేరాలు, చీటింగ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిట్టీలు, పెట్టుబడుల మోసాలు మూడింతలు పెరిగాయి. గత మూడేళ్లలో నగరంలో దోపిడీలు, దొంగతనాలు, సొత్తు కోసం హత్య వంటి అన్ని రకాల చోరీల కంటే ఆర్థిక నేరాలే అధికంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక నేరాలు, నమ్మకద్రోహం, చిట్టీల వంటి నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.
వెంగళరావునగర్: చిట్టీల వ్యాపారంతో చుట్టుపక్కల వారిని నమ్మించి, అధిక వడ్డీల ఆశ చూపి సుమారు రూ.100 కోట్లతో ఉడాయించిన నిర్వాహకుడు పుల్లయ్యపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వందలాది మంది సభ్యులను, పెట్టుబడిదారులను మోసం చేసి పరారైన బీకేగూడ, రవీంద్రానగనర్కు చెందిన పుల్లయ్యపై బల్కంపేట, చాణక్యనగర్కు చెందిన ఆకుల రాజు ఎస్ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.25 లక్షల చిట్టీ వేసిన రాజు డబ్బు చేతికందే సమయానికి పుల్లయ్య పరార్ కావడంతో గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజుతోపాటు ఫిర్యాదుదారుడి ఇంట్లో నివసించే పార్వతీ మల్లేశ్ యాదవ్‌కు రూ.40లక్షలు, గంట రవికి రూ.16లక్షలు, ఎం.రాజశేఖర్ కు రూ.10లక్షలు, మరొకరికి రూ.8లక్షలు పుల్లయ్య ఇవ్వాల్సి ఉన్నది. రెండు రోజులపాటు పుల్లయ్య ఇంటికి చేరుకున్న వందలాది బాధితులు గురువారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసును డీజీపీ కార్యాలయం ద్వారా సీసీఎస్‌కు బదిలీ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. పుల్లయ్య బాధితులను సీసీఎస్ పోలీసులు పిలిపించి వివరాలు సేకరించనున్నారు.