హైదరాబాద్ : కుల వృత్తి దారులు మరింత అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో బీసీ కులవృత్తి దారులకు ఆర్థిక సహాయం పంపిణీ పై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వివిధ కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.
నూతనంగా నాయీబ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, కంసాలి, కమ్మరి, కంచర, వడ్రంగి, పూసల, మేదర, వడ్డెర, ఆరేకటిక, మేర తదితర కులవృత్తులకు అర్హులైన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ముందుగా ఒక్కో నియోజకవర్గ పరిధిలో ౩౦౦ మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు.
ఒకేసారి కాకుండా దశల వారీగా లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో MLA లు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మౌజం ఖాన్, కౌసర్ మోయినోద్దిన్, కలెక్టర్ అనుదీప్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, BC కార్పోరేషన్ అధికారి ఆశన్న, GHMC ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.