జూబ్లీహిల్స్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గురువారం యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో సెక్టోరియల్ ఆఫీసర్లు, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓలతో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఓటర్‌కు ఓటరు స్లిప్ పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉప ఎన్నిక పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ ఆఫీసర్ పి.సాయిరాం, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ జీ.రజినీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది.