బంజారాహిల్స్,డిసెంబర్ 9: డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, సబ్జా కాలనీకి చెందిన అబుబాకర్ బిన్ అబ్దుల్ అజీజ్, టోలీచౌకికి చెందిన మహ్మద్ ఖాసిమ్ తదితరులు కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం తామే డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్న నిందితులు తమ స్నేహితులు సయ్యద్ ముర్తుజా , ముబాషిర్ ఖాన్, నితిన్ గౌడ్, పూనమ్ కుమారి తదితరులతో కలిసి ప్రణాళిక వేసుకున్నారు.
ఏపీలోని అరకుకు వెళ్లిన మహ్మద్ ఖాసిమ్ హాషిశ్ అయిల్ కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. మరో స్నేహితుడు ముర్తుజా అలీ ముంబాయి వెళ్లి చరస్ కొనుగోలు చేశాడు. వారిద్దరూ ఇటీవల నగరానికి వచ్చి స్నేహితులతో కలిసి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. శుక్రవారం రాత్రి షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీ మార్ట్ సమీపంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఫిలింనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులవద్దనుంచి 70 గ్రాముల చరస్, 310 మిల్లీలీటర్ల హాషిశ్ ఆయిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.