సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): పచ్చని వాతావరణం. పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణులు సంచారం. లక్షలాది మొక్కలు, అంతకు మించిన అరుదైన రాతిశిలాజ సంపదకు నిలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు రణరంగంగా మారింది. నిండుగా ఉండే జీవావరణాన్ని నిర్వీర్యం చేసేలా, వందల ఎకరాల భూములను కాజేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఇనుప బూట్లతో అడుగులు వేస్తోంది. పుస్తకాలతో కుస్తీ పడుతూ.. సాయంసంధ్య వేళలో ప్రకృతి నిలయమైన వర్సిటీ ప్రాంగణంలో సేద తీరే విద్యార్థులను.. జైలు బాట పట్టిస్తున్నది.
తమ వర్సిటీ భూములను ముట్టుకోవద్దంటూ శాంతియుతంగా చేస్తున్న నిరసనలను.. ఉక్కు పాదంతో అణగదొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కారు వందల ఎకరాల భూములను కాజేసే క్రమంలో లాఠీలను ఝళిపిస్తోంది. బయటి వ్యక్తులు అడుగు పెట్టలేని విద్యారణ్యంలోకి బుల్డోజర్లను ఎగదోసి కల్లోలిత ప్రాంతంగా మార్చేసి విద్యార్థుల నెత్తురు మరకలతో, వన్యప్రాణుల అర్తనాదాలతో, జీవన్మరణ పోరాటాలతో యుద్ధభీతి కలిగిస్తోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న వర్సిటీ పరిసరాల్లో భీతిగొల్పే కార్యకలాపాలతో ప్రభుత్వం చేస్తున్న దమనకాండ.. ఇప్పుడు యావత్ ప్రజానీకాన్ని కదలిస్తోంది. కేవలం విద్యార్థులు, టీజీఐఐసీకి మధ్యే నెలకొన్న ఘర్షణలో పౌరసమాజం పాలు పంచుకొంటోంది.
ప్రభుత్వం సృష్టిస్తున్న యుద్ధవాతావరణాన్ని నిలువరించేలా గళం విప్పుతోంది. సామాజిక మాధ్యమాలు, ప్రజా వేదికలపై తోచిన విధంగా వర్సిటీ భూములను కాపాడుకునేలా పోరాడుతూనే ఉన్నారు. చివరకు శాంతియుత నిరసనలు కాగా, అహింసపూరితంగా మారడంతో… ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దాష్టీకాన్ని అడ్డుకునేలా ప్రజా సంఘాలు, పర్యావరణ వినాశనం, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రకృతి ప్రేమికులు సైతం కదం తొక్కుతున్నారు. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో రేవంత్ సర్కారు తుఫాను భీతిగొల్పోతుంది.
ముక్తకంఠంతో ఖండిస్తున్న పౌర సమాజం
హెచ్‌సీయూ భగ్గుమంటోంది.. కొన్నేళ్లుగా చాలా సైలెంట్ ఉన్న వర్శిటీలో రేవంత్‌రెడ్డి సర్కార్ దింపిన బుల్డోజర్లతో అట్టుడుకుతున్నది. 400 ఎకరాలు ప్రభుత్వానివేనని పేర్కొంటూ అమ్ముకునే ప్రక్రియకు ప్రజాపాలన సర్కారు శ్రీకారం చుట్టింది. విద్యార్థి లోకం సెంటు భూమిని కూడా వదలుకోమని, హెచ్‌సీయూకే ఆ భూములు చెందాలంటూ పోరాటం చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వ దమనకాండను పౌరసమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నది. సినీ రాజకీయ ప్రముఖ మేథావులు, పర్యావరణ నిపుణులు, మాజీ ప్రొఫెసర్లు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరించొద్దని, నిరసన తెలిపే హక్కును హరిస్తుందని పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం సమంజసం కాదన్నారు. విశ్వ విద్యాలయాల భూమిని వేలం వేయకుండా అపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తూ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు.
అభిప్రాయ సేకరణ తప్పనిసరి: వేదకుమార్ మణికొండ
ప్రభుత్వ భూముల వేలం, అమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపడం, నగరం అభివృద్ధి చేస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని మాస్టర్ ఆఫ్ అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ ఇంజినీర్ వేదకుమార్ మణికొండ అన్నారు. వర్సిటీకి భూములు, పభుత్వ భూములైనా వేలం సమయంలో ప్రజాభ్రిపాయం, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. తాము అధికారంలో ఉన్నామని ఏది చేసినా చెల్లుతుందనే భావన సరికాదు. వర్సిటీ వీసీ, స్టాఫ్, విద్యార్థుల అభ్రిపాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై చర్యలు సరైన విధానం కాదు. పభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా ప్రజల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తే హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది.
విద్యార్థులపై పోలీసుల లాఠీచార్చి దారుణం
కవాడిగూడ, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి దారుణమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. దివంగత ప్రధాని ఇందిరాగాధీ చొరవతో హెచ్సీయూకు కేటాయించిన 2300 ఎకరాల భూమి నుంచి 400 ఎకరాలను తిరిగి వేలం వేయటం సరికాదు. యూనివర్సిటీ భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన భూమిని టీజీఐఐసీ ద్వారా అప్పగించే ప్రయత్నాన్ని మేధావులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించి విద్యార్థులతో చర్చలు జరపాలి. ఆ భూమి వర్సిటీదా కాదా సర్వే ద్వారా తేల్చిన తర్వాతే నిజాన్ని నిర్ధారింని చర్యలు తీసుకోవాలి.
– చావ రవి, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్
నమ్మితే అమ్మే నైజం రేవంత్‌రెడ్డిది..
రేవంత్‌రెడ్డిని నమ్మి అధికారం అప్పజెబితే ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమిస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ప్రగతికి నిలయాలు. విద్యాలయాల సంస్థల భూములను అమ్ముకోవడం అంటే విద్యా వ్యవస్థను నాశనం చేయడం అవుతుంది. యూనివర్సిటీల భూములను అమ్ముకునే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అమ్మడానికి ప్రయత్నించడం దారుణం. సీఎం రేవంత్‌రెడ్డి ఇలానే చేస్తే ఐదేండ్లు అధికారంలో ఉండటం కష్టమే.
– భూపతి వెంకటేశ్వర్లు, టీపీఎస్ కే రాష్ట్ర అధ్యక్షుడు