సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పండుగొచ్చిందంటే చాలు.. ప్రయాణికుల జేబులు గుల్లా కావాల్సిందే. సొంతూరుకు వెళ్లాలంటే రెట్టింపు ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దసరా సెలవులు కావడంతో నగరం నుంచి చాలా మంది ప్రయాణికులు సొంతూరి బాట పడుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న అరకొర ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దీంతో చాలా వరకు ప్రయాణికులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనాల వ్యక్తులు ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు.
హనుమకొండ వెళ్లాలంటే రూ. 290 చార్జీ ఉంటుంది. ఈ రేటును ప్రైవేటు వాహనాలు 700 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారని రాజు అనే ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉప్పల్ నుంచి తొర్రూరుకు రూ.430 టికెట్ ధర ఉండగా, ప్రైవేటు వాహనంలో రూ.900లపైనే వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ట్యాక్సీ వాహనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, బార్డర్ ట్యాక్సీ, ప్రొఫెషనల్ డ్రైవర్, రోడ్డు నిబంధనలపై అవగాహన తదితర ఆర్టీఏ నిబంధనలకనుగుణంగా ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, ప్రభుత్వ సాయం తదితరాలు అందుతాయి. వీరికి బిజినెస్ ఎక్కువ జరిగితే పరోక్షంగా వారు చెల్లించే ట్యాక్స్‌లో ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా వైట్ కలర్ ప్లేట్ వాహనాలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి.
హైదరాబాద్‌లో 1.86 లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు. అందులో 33 వేల మందివ ఐటీ రంగాన్ని నమ్ముకుని రైడ్స్ చేస్తున్నారు. మరో 28వేల మంది టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై ట్రిప్స్ కొడుతున్నారు. ఆర్టీఏ అధికారుల సరైన పర్యవేక్షణ కరువవడంతో వైట్ నంబర్ ప్లేట్ వాహనాలు ట్రిప్పులు కొడుతున్నాయి. నంబర్ ప్లేట్.. యెల్లో కలర్లో ఉంటే ప్రయాణికుల రాకపోకలు.. వైట్ కలర్లో ఉంటే సొంత వాహనమని అర్థం. అయితే ఇప్పుడు వైట్ కలర్ ప్లేట్ వాహనాలు కూడా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతూ ట్యాక్సీ డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాల వ్యక్తులు ప్రయాణికుల నుంచి రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ట్రిప్స్ కొడుతున్నారు. వీరిపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
-షేక్ సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్