సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కాని దరఖాస్తుల పరిశీలన పూర్తి కాకుండానే ఫీజులైతే కట్టాలంటూ నోటిఫికేషన్లను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు చేరవేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3.50 లక్షలకు పైగా దరఖాస్తులు ఉండగా.. ఇందులో 2.85లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ సమాచారాన్ని చేరవేసినట్లుగా తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
దీంతో తమ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాకుండానే ఫీజుల పేమెంట్ లింక్ యాక్టివేట్ కావడంతో… దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఫళంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని జనాలు వాపోతున్నారు. భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వ దూకుడు వ్యవహారంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాకుండానే ఫీజులు చెల్లించాలని ఆదేశాలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3.50 లక్షలకుపైగా జీపీ లే అవుట్లు, అనధికారిక వెంచర్లలో ప్లాట్లు ఉన్నాయి.
వీటిలో అనధికారిక లే అవుట్లు కూడా ఉండగా… వీటిన్నింటికి ఎలాంటి పరిశీలన జరగకుండా ఫీజులు అయితే చెల్లించాలనే ఆదేశాలిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులు ముందుగానే ఫీజులు చెల్లిస్తే, ఆ తర్వాత రెగ్యులరైజ్ అవకాశాలను బట్టి ప్రొసిడింగ్స్ జారీ చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ప్రొసిడింగ్స్ ఇవ్వలేని సమస్యలు ఉంటే గనుక చెల్లించిన ఫీజులో 10 శాతం కోత విధించి, 90శాతం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ లెక్కన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఫీజు ఇంటిమేషన్ జారీ అవుతున్నట్లుగా తెలిసింది.