కాచిగూడ, జూన్ 4: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలున్నాయని.. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం నింబోలి అడ్డ కార్యాలయంలో రాష్ట్ర బీసీ నాయకులు ఏర్పాటు చేసిన సమాశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మాసీ, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులకు రూ.4,200 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయని, అనేకమార్లు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, చేపట్టినా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డాడు.
ఇటీవల అక్కరకురాని అందాల పోటీలకు ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టిందని, అదే ఫీజు బకాయిలు చెల్లిస్తే లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినట్లు అయ్యేదని పేర్కొన్నారు. విద్యపై అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యా వ్యవస్థ మరింతగా భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ నేమ్కర్, భూషణ్ భాస్కర్, పీ కృష్ణ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.