Srisailam Dam | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్నదని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి విజయపాల్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం డ్యామ్ భద్రతకు చర్యలను చేపట్టాలని కోరుతూ అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.
వారితోపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సాగునీటిపారుదలశాఖ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మరమ్మతు పనులను చేపట్టి డ్యామ్‌ను సంరక్షించాలని డిమాండ్ చేశారు.
జల్‌శక్తి కమిటీ హెచ్చరికలు బేఖాతరు
శ్రీశైలం డ్యామ్ నిర్వహణను ఏపీ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తున్నదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. శ్రీశైలం డ్యామ్ భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఇరు రాష్ర్టాలకు చెందిన అధికారులతో కేంద్ర జల్‌శక్తిశాఖ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఆ బృందం 2022 ఫిబ్రవరి 7-9 తేదీల్లో శ్రీశైలం డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టును ఏపీ నిర్వహిస్తున్న తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించింది. స్పిల్‌వే దిగువన ప్లంజ్ పూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నదని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తకువకు పడిపోతున్నదని, ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది.
డ్యామ్ పరిరక్షణ చర్యలు చేపట్టలేదని..
ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలావరకు డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని, ఇది ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నదని వెల్లడించింది. మరికొన్ని డ్రైనేజీ రంధ్రాలు తీవ్రమైన ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలోకి నీటిని విడుదల చేస్తున్నాయని, నీరు సురక్షితంగా పారేలా చేయాలని సూచించింది. పూడుకుపోయిన డ్రైనేజీ రంధ్రాలను మరమ్మతు చేసి డ్యామ్ గ్యాలరీలో పారుతున్న నీటిని బయటకు పంపేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అయినప్పటికీ ఇటీవలివరకు డ్యామ్ పరిరక్షణ చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం, ఇరిగేషన్‌శాఖ అధికారులు, కేఆర్ఎంబీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డ్యామ్ రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌తో సహా అధికారులకు తెలంగాణ ఫార్మర్స్ ఆసోసియేషన్ ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి విజయపాల్‌రెడ్డి లీగల్ నోటీసులు జారీచేశారు. శ్రీశైలం డ్యామ్‌పై దక్షిణ తెలంగాణ భవితవ్యం ఆధారపడి ఉన్నదని తెలిపారు. డ్యామ్‌కు ఏదయినా నష్టం వాటిల్లితే దక్షిణ తెలంగాణ రైతాంగం తమ జీవనోపాధిని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం భద్రత చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి