సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ అడ్డూఅదుపు లేకుండా ప్రలోభాలకు తెరతీసింది. కొద్దిరోజులుగా నియోజకవర్గంలోని వాడవాడలా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే డబ్బులు పంచారు. ఓటుకు ఇంత.. ఏరియాకు ఇంత అని రేటు కట్టి ఓటరుకు పంచుతూ హడావుడి చేస్తున్నా ఎన్నికల అధికారులు చూస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడా చర్యలు తీసుకున్నది లేదు.
అధికార పార్టీ కాబట్టే ఇలా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సహా అన్ని పక్షాలు విమర్శించినా వారికి చీమకుట్టినైట్టెనా లేదు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదుతో పాటు కుక్కర్లు, చీరెలు, ఇతర సామగ్రిని కూడా ఇంటింటికీ పంచినట్లు ప్రచారం జరుగుతున్నది. డబ్బులన్నీ నాలుగు రోజుల ముందే మంత్రుల సాక్షిగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డంప్ చేయగా వాటిని రోజుకో చోటకు పంపారు. ఆ తర్వాత స్థానిక నేతలు లిస్టులు పట్టుకొని ఒక్కొక్కరికి ఓటు చొప్పున పంపిణీ చేశారని ఓటర్లే స్వయంగా చెబుతున్నారు. ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యవహరించిందంటూ స్వయంగా ఓటర్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎన్నికల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈసీ పట్టించుకోదా?
నగదు పంచుతున్నట్టు సాక్ష్యాలు ఉన్నా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడా న్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రహ్మత్‌నగర్‌లో ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ డబ్బులు పంచుతూ ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగి మరీ డబ్బులు లెక్కపెట్టి ఇచ్చే వీడియో సంచలనం సృష్టించింది. అలాగే బోరబండ సాయిబాబానగర్‌లో ఓ వీధిలో అరుగుపై కూర్చొని ఓటరు స్లిప్పులతో పాటు డబ్బులు ఇస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా ఎన్ని సంఘటనలు ఉన్నా కేవలం ఎర్రగడ్డలోని ఓ హోటల్‌పై దాడులు చేసి ఒకరిద్దరిని పట్టుకోవడం తప్ప పంపిణీని సీరియస్‌గా తీసుకోలేదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మద్దతుదారుల షాపులే అడ్డాలుగా !
డబ్బులు పంచేందుకు తమ మద్దతుదారుల దుకాణాలను అడ్డాలుగా చేసుకున్నది కాంగ్రెస్. ఓటరుకు ఎలా ఇవ్వాలో ముందుగానే సెటప్ చేసుకుని అపార్ట్మెంట్లు, కొన్ని భవన సముదాయాల వారికి ఓట్లను బట్టి డబ్బులు ఇచ్చారు. బోరబండలో ఉన్న ఒక వర్గానికి చెందిన ప్రార్థనాలయాల పెద్దలు ఆరుగురికి డబ్బులు పంపగా వారిలో ముగ్గురు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆ గ్రహంతో ఉన్న ముస్లిం ఓటర్లు తమ ఓటు విషయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగేది లేదని తెగేసి చెప్పారు. ఎర్రగడ్డలో రెండు హోటళ్లలో డబ్బులు పంపిణీ చేయగా, రహ్మత్‌నగర్‌లో ఓ టైలర్ షాపు, ఒక హోటల్, ఒక చిన్న దుకాణంలో డబ్బులు పంచినట్టు స్వయంగా ప్రజలే చెబుతున్నారు.
యూ సుఫ్‌గూడలో ఓ హోటల్ వెనుక ఉన్న రూమ్‌తో పాటు ఒక వ్యక్తి ఇంట్లో డబ్బుల పంపిణీ జరిగిందని ఆ ప్రాంత ఓటర్లు చర్చించుకుంటున్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు.. ముస్లింకు ఒక రేటు.. క్రిస్టియన్‌కు ఒక రేటు.. మిగతావారికి మరో రేటు.. ఇక్కడ కూడా ‘విభజించు.. డబ్బులు పంచు’ అన్నట్టు కాంగ్రెస్ అమలు చేసింది. పోలింగ్ రోజు కూడా స్లిప్పులతో పాటు డబ్బులు పంచేందుకు అడ్డాల్లో సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు ఓటర్లు ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. రహ్మత్‌నగర్‌లో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు డంప్ ఉన్నదనే సమాచారంతో ఎలక్షన్ కమిషన్‌కు శ్యామ్ అనే ఓటరు ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగే పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున డబ్బులను పంచేందుకు ఏజెంట్లకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారని తెలిసింది.