కీసర, సెప్టెంబర్ 24: ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువతిని… ఆమె పుట్టింటి వాళ్లు కాళ్లు.. చేతులు కట్టేసి.. అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు.. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి.. ఆమె కాళ్లు కట్టేసి కారులో పడేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. అంత గొడవ జరుగుతున్నా.. అక్కడ పట్టించుకునే వారు లేరు. బుధవారం నగర శివారులోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు.. దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన చిత్తారి, పద్మల కుమారుడు ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన బాల్నర్సింహ, మహేశ్వరిల కుమార్తె శ్వేత ఏడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
శ్వేత కుటుంబం వారు పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో గత జూలై 11న సికింద్రాబాద్లోని ఆర్య సమాజ్లో ప్రవీణ్, శ్వేత పెండ్లి చేసుకున్నారు. వివాహామైన తరువాత నగరంలోనే నివాసముంటున్నారు. సమస్య పరిష్కారమవుతుందని, ఒకే గ్రామానికి చెందిన వాళ్లం కావడంతో పెద్దలు మనసు మార్చుకొని తమ పెండ్లికి అంగీకరిస్తారనే భావనతో శ్వేత, ప్రవీణ్ ఉన్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారు తన సొంత గ్రామమైన నర్సంపల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు బాల్ నర్సింహ, మహేశ్వరి, బంధువులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి.. శ్వేతను కాళ్లు, చేతులకు తాడు కట్టి, ఆమెను చితకబాదుతూ.. ఈడ్చుకుంటూ వెళ్లి కారులో పడేశారు.
అడ్డొచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రుల కండ్లలో కారం చల్లి వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. 15 నిమిషాల పాటు ప్రవీణ్ ఇంటి వద్ద రణరంగం చోటు చేసుకుంది. ఈ దౌర్జన్యాన్ని చూడలేక ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఒకానొక సమయంలో ఇంట్లో నుంచి గొడ్డలి తెచ్చి కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు స్థానికులు వారించి వాళ్లను ఆపేశారు. ఇదిలాఉండగా శ్వేత భర్త కీసర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పేర్కొన్నాడు. తన భార్యను తనకు అప్పగించాలని, తాము పెండ్లి చేసుకున్నప్పటి నుంచి అన్యోన్యంగా ఉంటున్నామని, తన భార్యలేంది తను ఉండలేనని.. తన భార్యను తనకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.