దుండిగల్: వినాయక నిమజ్జనోత్సవం ఓ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌కు చెందిన డొక్కా శ్రీను(35), సోని దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. శ్రీను ట్రాలీఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రీను కుటుంబం నివాసముంటున్న మార్కెట్ వీధిలో స్థానికంగా ఉండే పిల్లలు కొందరు గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఐదురోజుల పాటు పూజలు నిర్వహించారు.
ఆదివారం రాత్రి వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు గాను శ్రీనుకు చెందిన ట్రాలీఆటోను కిరాయికి మాట్లాడుకొని పెద్ద(మోతీ) చెరువు వద్దకు వెళ్లారు. శ్రీనుతో పాటు అతని పెద్దకొడుకు జాన్‌వెస్లీ(7) కూడా నిమజ్జనోత్సవానికి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువులో వినాయక ప్రతిమను నిమజ్జనం చేసిన అనంతరం ఆటోను చెరువుకట్టపై రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి నీటమునిగి పోయింది. డోర్‌లాక్‌లు ఓపెన్కాకపోడవంతో తండ్రీకొడుకులు ఇద్దరు ఆటోట్రాలీ క్యాబిన్లో నుంచి బయటకు రాలేక జలసమాధి అయ్యారు. దీనిని ఎవరూ గమనించలేదు.
త్వరగా ఇంటికి వెళ్లి ఉంటారని భావించారు. సోమవారం తెల్లవారినా ట్రాలీఆటోతో సహా తండ్రీకొడుకులు ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆటో చెరువులోకి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో ఆటోతో సహా తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.