మేడ్చల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ముఖ్యంగా అన్నదాతలు సీఎం రేవంత్‌రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అమలు కాకపోవడంతో పోరుబాట పట్టారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రైతులు ‘రైతు రుణమాఫీ సాధన’ పేరిట వారం రోజులుగా రిలే నిరాహర దీక్షలు చేపట్టారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం.
జిల్లాలో రుణమాఫీ కావాల్సిన రైతులు 28,201 మంది రైతులుంటే చివరి విడుత వరకు రుణమాఫీ చేసింది 4,371 మందికి మాత్రమే.దీంతో రైతుల అధికారులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఫలితం రాకపోవడంతో అన్నదాతలు ఉద్యమ బాట ఎంచుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతున్నదని హెచ్చరించారు.
దరఖాస్తుల పేరిట డ్రామా..
అమలు చేయాల్సిన పథకాలను ఎగ్గొటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. రుణమాఫీ చేసే విషయంలో రైతులను దరఖాస్తుల పేరిట ఇబ్బందులను గురి చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు చేసినా దరఖాస్తులు తీసుకున్నా ఏ ఒక్కరికి మాఫీ వర్తింప చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి రాకముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అర్హత ఉన్న రైతులకు మాత్రమే అన్న మెలిక పెట్టడం ఏంటని జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.
బోనస్.. బోగస్
సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ మాట బోగస్‌గానే మారింది. యాసంగి వడ్లకు ప్రభుత్వం రూ. 5 వందల బోనస్ ఇస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 32 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను రైతులు విక్రయించగా రూ.1.60 కోట్లు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉండగా నాలుగు నెలలు దాటినా ఇంతవరకు అతీగతీ లేదు. ఇలా ఒకటి కాదు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతన్నలు మండిపడుతున్నారు.