“కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను, రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు మొండి చేయి చూపించింది. కాలానుగుణంగా పంటలకు పెట్టుబడి ఇవ్వాల్సిన రైతు భరోసాకు ఎగనామం పెట్టింది. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ హామీనే తుంగలో తొక్కాడు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలు ప్రజలకు పట్టపగలే ఆకాశంలో చుక్కల్ని చూపిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి.. ఇక్కడ చేసిందొకటని.. తేరుకున్న రైతాంగం మోసపోయామని గుర్తెరిగి రోడ్డెక్కారు. కడుపు మండిన రైతన్నలు బీఆర్ఎస్ నేతలతో కలిసి నగరంలో పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగానికి మంచి బుద్ధి ప్రసాదించమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.”
BRS | మహేశ్వరం, అక్టోబర్ 20: వర్షాకాల రైతు భరోసా విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు, రైతులు మహేశ్వరం మండల కేంద్రంలో, తుక్కుగూడలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నా నిర్వహించి మహేశ్వరం మండల చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించి రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చూపించాలని అంబేద్కర్‌ను వేడుకున్నారు. తుక్కుగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రైతులకు ఇవ్వవలసిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇప్పుడు రైతు భరోసా తీసుకుంటే పదివేలు మాత్రమే వస్తాయి.. ఎన్నికల తర్వాత తీసుకుంటే పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు. అది ఎందకు అమలు చేయడం లేదని రైతాంగం, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అతీ గతీ లేదన్నారు.
ఎకరానికి రూ.15,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు జాడలేదన్నారు. రైతు రుణ మాఫీ, రైతు బంధు లేనట్లేనని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొనడంతో లక్షలాది మంది రైతులను ఆందోళనకు గురి చేసిందన్నారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
రైతు రుణమాఫీ సగం మందికి కూడా సరిగా ఇవ్వలేదన్నారు. రైతుల గోసలు, కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, కర్రోల చంద్రయ్య, అంబయ్య యాదవ్, కౌన్సిలర్ రవి నాయక్, బంగు రమేష్, శ్రీలత, సుమన్, జంగయ్య, నవీన్, పుధీర్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, ఆంజనేయుడు, రతన్, జానారెడ్డి, రాజు, రాములు, శివ కుమార్, సయ్యద్ అలీ, దుడ్డు కృష్ణ యాదవ్, శ్రీశైం, నరేష్ రెడ్డి, దర్శన్, కృష్ణ, సాయిరాం, నర్సింహరెడ్డి, రాజేష్, వీరబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.