పరిగి, ఏప్రిల్ 1 : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్‌నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ భూములను లాక్కోవద్దని అధికారులందరికీ విన్నవించినా ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను లాక్కుంటే తాము బతికేదెలా అని ప్రశ్నించారు. భూ సేకరణను నిలిపివేస్తున్నట్లు సర్కారు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ సేకరణను ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రైతులు చాలా సమయం వరకు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల నిరసనను అడ్డుకునే ప్రయ-త్నం చేయగా.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. తమ భూములు పోయి ఆందోళన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అన్నదాతలు ప్రశ్నించా రు. రైతులు అలాగే రోడ్డుపై బైఠాయించగా పోలీసులు సముదాయించి తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడించారు. మీ సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ చెప్పగా.. అన్నదాతలు ఆందోళన విరమించారు.