శామీర్ పేట్, ఫిబ్రవరి 23 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియ మందు చల్లుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగిలింది. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ లో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు…. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామానికి చెందిన బుద్ది వెంకటేశ్( 40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆదివారం పొలంలో యూరియా మందు చల్లేందుకు వెంకటేశ్‌తో పాటు కుమారుడు సృజన్ కూడా తండ్రి వెంట వెళ్లాడు. తండ్రికి స్టీల్ గంపలతో యూరియా అందిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పొలంగట్టుపైన వేలాడుతున్న కరెంటు తీగలు కుమారుడు ఎత్తుకున్న యూరియా గంపకు తగిలాయి. కరెంటు షాక్ తగిలి ఒక్కసారిగా అరుస్తూ కేకలు వేస్తున్న సృజన్‌ను కాపాడే ప్రయత్నంలో తండ్రి వెంకటేశ్ విద్యుత్ షాక్ తగిలి విగతజీవిగా మారిపోయాడు.
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వైద్య సేవల నిమిత్తం అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కుమారుడు సృజన్ కు భుజానికి గాయమై ఎముక విరిగింది. కాగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని తాము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు స్పందించలేదని వారి నిర్లక్ష్యమే నిండు రైతు ప్రాణాన్ని బలితీసుకున్నదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామసభల్లోనూ, ప్రజాపాలన సభల్లోను ఈ సమస్యపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు.