Prabhas Fans | బంజారా హిల్స్, మార్చి 29: ‘డార్లింగ్ ఇన్ డేంజర్’.. అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ఇచ్చావంటూ యూట్యూబర్ ను అంతు చూస్తామంటూ బెదిరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ సాదు (40) కృష్ణా నగర్ లో నివాసం ఉంటున్నారు . జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.44 లో డయల్ న్యూస్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 4న తన యూట్యూబ్ చానల్ లో డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్ పెట్టి హీరో ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదని, ఆయనకు ఇటలీలో సర్జరీ జరిగిందంటూ కథనం ప్రసారం చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన గురయ్యారు. మరుసటి రోజు సురేశ్ కొండి అనే వ్యక్తి విజయ సాదుకు కాల్ చేశారు. తాను పీ ఆర్ ఓ అని చెప్పుకున్న సురేశ్.. వీడియోలో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు కథనం ప్రసారం చేశారని, మీ వద్ద ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించారు. వెంటనే ఈ వీడియోని డిలీట్ చేయాలని సూచించారు.
తాను డిలీట్ చేసేది లేదని విజయ్ సాధు పేర్కొన్నారు. దీంతో తన ఫోన్ నంబర్‌ను ప్రభాస్ అభిమానులకు సురేశ్ పంపించారని, అప్పటినుంచి పెద్ద సంఖ్యలో తనకు బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభమైందని, వీడియో డిలీట్ చేయకపోతే అంత చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారంటూ విజయ సాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సురేశ్ కొండితో పాటు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కోర్టు అనుమతితో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం సురేశ్ కొండి తదితరులపై బీఎన్ఎస్ 351 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేపట్టారు.