సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): ‘మేం క్రెడిట్ కార్డు కాల్‌సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ క్రెడిట్ కార్డుకు సర్వీస్ చార్జీలు.. బిల్లులో రాయితీ ఇస్తున్నాం.. ఈ అవకాశాన్ని వాడుకోండి.. నెలవారి బిల్లు తగ్గుతుంది.. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ కింద లింక్‌ను క్లిక్ చేసి, వివరాలను పొందుపరచండి’.. అంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు సైబర్‌నేరగాళ్లు. నెలవారీ బిల్లులో నిజంగానే తగ్గుతుందనే ఆశతో క్రెడిట్ కార్డుదారు నేరగాళ్లు సూచించిన లింక్‌ను క్లిక్ చేస్తూ.. మోసపోతున్నారు.
సైబర్‌నేరగాళ్లు రోజుకో కొత్త తరహా పంథాతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మోసాల్లో ఒకటి క్రెడిట్ కార్డు రాయితీ. దీని కోసం నకిలీ వెబ్సైట్లను తయారు చేసి, ఆ లింక్‌లను బాధితులకు పంపిస్తున్నారు. వాటిపి క్లిక్ చేయగానే ఒక వైపు బ్యాంకు పేరు కూడా కనిపిస్తుంది. దీంతో, ఆ లింక్‌లోని మెసేజ్ నిజమేనని బాధితులు నమ్ముతున్నారు. ‘ఆ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు పొందుపర్చండి’.. అంటూ నేరగాళ్లు సూచిస్తున్నారు. దీంతో బాధితులు క్రెడిట్‌కార్డు, సీవీవీల నంబర్లను కూడా అందిస్తున్నారు.
ఆ సమయంలో ఓటీపీ కూడా వస్తుంది. అయితే ఓటీపీ ఇచ్చే సమయంలో కొందరు అనుమానించి..మోసాన్ని గుర్తిస్తున్నారు. మరికొందరు మాత్రం ఓటీపీని కూడా చెప్పేస్తున్నారు. ఇలా ఓటీపీ చెబితే.. ఆ క్రెడిట్ కార్డు మొత్తం సైబర్‌నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఓటీపీ చెప్పే వరకు ఆ క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత అనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. మీకు ఈ నెల క్రెడిట్ కార్డు బిల్లు ఎంత వచ్చిందనే విషయాన్ని నేరుగా బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు.
నగరానికి చెందిన ఓ వ్యాపారికి క్రెడిట్ కార్డు నెలవారీ బిల్లులో తగ్గింపు ఇస్తున్నామంటూ ఫోన్ చేశారు. ఆయన వారి మాటలు నిజమని నమ్మాడు. వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగానే ప్రైవేట్ బ్యాంకు పేరుతో ఒక వెబ్సైట్ పేజీ ఓపెన్ అయ్యింది. అందులో ఒక ఫామ్ ఇచ్చి, వివరాలు పొందుపరచాలంటూ.. నేరగాళ్లు సూచించారు. దీంతో బాధితుడు తన వద్ద ఉన్న క్రెడిట్‌కార్డు వివరాలను అందించాడు. ఓటీపీ కూడా చెప్పడంతో సైబర్‌నేరగాళ్లు రూ. 2.03 లక్షలు స్వాహా చేశారు.