సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జరిగాయి. అందులో ఒకటి సూడో పోలీసులది కాగా.. మరొకటి దారి దోపిడీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో నాగోల్ నుంచి సిటీ బస్సులో తమ బంధువు చింటురామ్ను సికింద్రాబాద్లో బస్సు ఎక్కించేందుకు ఆత్మారామ్, గజన్నాత్ వెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టివోలి థియేటర్ చౌరస్తా వరకు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు.
జేబీఎస్ వద్ద ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తాను పోలీసునని.. మీరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.. విచారణకు రావాలంటూ అడుగుతుండగానే మరో ఇద్దరు ఆటోలో వచ్చి వాళ్లను ఆటోలో ఎక్కించారు. కొద్దిదూరం తీసుకెళ్లి ఖాళీ ప్రాంతంలో బ్యాగ్లు తనిఖీ చేశారు. ఏమీ లేదంటూ పంపించారు. అయితే, బ్యాగ్లో ఉన్న నగదును, రెండు సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. దీనిపై బాధితులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉండగా.. శుక్రవారం తెల్లవారుజామున విధులు ముగించుకొని సంగీత్ చౌరస్తా వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్న జానీకి స్విఫ్ట్కారులో వచ్చిన వారు లిఫ్ట్ ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతడి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. అతడి వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ దోచుకున్నారు. బాధితుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.