Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతున్నది. గ్రేటర్లో యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా నగరంలోని కల్లు కంపౌండ్లకు నకిలీ కల్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. 2007లో నగర శివార్లతో పాటు ఇతర జిల్లాల్లో కల్తీ కల్లు సేవించి సుమారు 8వేల మంది అస్వస్థతకు గురవ్వగా, అందులో 12 మంది మృత్యువాతపడ్డారు. ఆ తరువాత 2012లో మరోసారి రంగారెడ్డి జిల్లా పరిధిలో కల్తీకల్లుతో పలువురు అస్వస్థతకు గురైన ఉదంతాలు వెలుగుచూశాయి.
కల్తీ కల్లు తయారు చేయడంతో పాటు నగరానికి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నాలుగు డ్రమ్ముల కల్తీ కల్లు, 2కిలోల అమోనియం బైకార్బొనేట్ పౌడర్, సిట్రిక్ యాసిడ్ సంచి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం… కడ్తాల్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా కల్తీకల్లు తయారవ్వడంతో పాటు పెద్ద ఎత్తున నగరానికి సరఫరా అవుతున్నట్లు సమాచారం అందుకున్న కడ్తాల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి ఈనెల 3న ఠాణా పరిధిలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. పాలకుర్తి రాఘవేందర్ ఇంటివద్ద పెద్ద ఎత్తున కల్తీ కల్లు తయారీ కేంద్రం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.