సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సీనియర్ ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి వారి అసలు ఖాతాల్లో ఉన్న ఫ్రెండ్స్‌కు రిక్వెస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న 19 ఏండ్ల యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్..తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీ సృష్టించి ఆ ఖాతాను ఉపయోగించి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపడం, తన ఒరిజినల్ ఖాతాలో ఉన్న స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు కోరారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన ఫొటోలను ఉపయోగించి చాలా నకిలీ ప్రొఫైళ్లను తయారు చేశారని, తాను సీఆర్పీఎఫ్
అనుచితమైన, తప్పుదారి పట్టించే మెసేజ్‌లు పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజస్థాన్ రాష్ట్రంలోని బహదూర్‌పూర్‌కు చెందిన అర్బాజ్‌ఖాన్ అనే 19 ఏండ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతనిపై తెలంగాణలో రెండు కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, సీఆర్పీఎఫ్ అధికారుల పేర్లతో నకిలీ ఫేస్బుక్ ఐడీలు, వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి వారి సహోద్యోగుల నుంచి నిందితుడు డబ్బులు లాగాడని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారిణి రశ్మీ పెరుమాల్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసి కొందరికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించినట్లు ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వారు ఆ ఐడీ నకిలీదని చెప్పి ఎవరూ ఇటువంటి రిక్వెస్ట్‌లకు సంప్రదించవద్దని సూచించారు.
ఫేస్బుక్లో కొంతయాక్టివ్గా ఉండి నలుగురిలో పేరు కలిగిన వ్యక్తులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వీరి పేర్లపై నకిలీ ఖాతాలను సృష్టించి వారి ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఫేస్బుక్ ద్వారా సంప్రదించి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. సాధారణ వ్యక్తుల పేర్లపైనే కాకుండా అత్యున్నత సివిల్ సర్వీసుల్లో ఉన్న అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు తమకు ఎక్కువగా అందుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు దాదాపుగా రాజస్థాన్ రాష్ట్రంలోని బహదూర్‌పూర్ నుంచే జరుగుతున్నట్లు తెలిపారు. ఒకవైపు ఈ నేరాలపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఫేస్‌బుక్‌కు కూడా లేఖ రాశారు. ఎవరి పేరు మీదైనా నకిలీ ఖాతాలు సృష్టించినట్లు తెలిసినా.. ఎవరైనా అధికారుల పేర్లతో రిక్వెస్ట్ పంపించినా.. అది నిజమేనా కాదా నిర్ధారించుకుని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.