సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలతో బర్త్సర్టిఫికెట్లు, పాత తేదీల బాండ్ పేపర్లతో నకిలీ సేల్‌డీడ్స్, నకిలీ ఆదాయ తదితర ధ్రువీకరణపత్రాలు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన తోట వెంకట భాను ప్రకాశ్, ఆయన భార్య సాగరిక సరూర్‌నగర్‌లోని ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో డీటీపీ ఆపరేటింగ్ పనులు నిర్వహిస్తున్నారు.
వీళ్లకు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ అయిన హయత్‌నగర్‌కు చెందిన అడ్డగూడూరు చంద్రశేఖర్, ఆయన కొడుకు అనిల్ పరిచయమయ్యారు. గతంలో పలు కేసుల్లో అరెస్ట్ అయిన పాత నేరస్తుడు సిటీ సివిల్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేసిన సయ్యద్ ఫిరోజ్ అలీ, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసే అంబర్‌పేట్‌కు చెందిన ఎండీ జలీల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి తోడు పరారీలో ఉన్న నల్గొండకు చెందిన పులుసు మల్లేశ్‌గౌడ్, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే ప్రవీణ్, నార్సింగి మున్సిపాలిటీ ఉద్యోగి దుద్దు సుధాకర్‌కుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్లో పనిచేసే ముదస్సిర్ జత కట్టారు.
నకిలీ స్టాంప్ పేపర్లు, పాత తేదీలలో ఉన్న బాండ్ పేపర్లు ఒకరు సమకూరిస్తే , వాటితో పాత డేట్లో సేల్ డీడ్లు తయారు చేయడం, సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ తదితర పనులకు డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. ఆయా డాక్యుమెంట్లలో సంతకాలు చేసి, స్టాంప్‌లు వేసేందుకు డాక్టర్లు, స్టాంప్ వెండర్లు, నోటరీలకు సంబంధించిన పలువురి పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంప్‌లు తయారు చేయించి వాడుకుంటున్నారు. నకిలీ పత్రాలను తయారు చేస్తూ ఒక్కొక్కరి వద్ద రూ. 5 వేల నుంచి రూ 20 వేల వరకు వసూలు చేస్తుంటారు.
విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ అదనపు డీసీపీ షేక్ హుస్సేన్, ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి బృందం తోట భానుప్రకాశ్ ఎంటర్‌ప్రైజెస్‌లో సోదాలు నిర్వహించడంతో 571 డాక్యుమెంట్లు లభించాయి, అందులో 280 నకిలీ సేల్ డీడ్స్ ఉన్నట్లు గుర్తించారు. కామారెడ్డి, నార్సింగి, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీల నుంచి పలు బర్త్సర్టిఫికెట్లు జారీ కాగా వాటికి సమర్పించిన దవాఖానల డాక్యుమెంట్లు ఫేక్ అని నిర్ధారించారు.
నకిలీ కులం సర్టిఫికెట్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం చాలా మంది ఈ ముఠా నుంచి నకిలీ ఆదాయ పత్రాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా జల్ల కిశోర్‌కుమార్, చంచల నిఖిల్, సత్యప్రభు కూడా ఈ ముఠాతో చేతులు కలిపారు. ఈ కేసులో 13 మంది నిందితులను గుర్తించారు. ఎవరైనా డాక్యుమెంట్లు తీసుకునే సమయంలో అవి నిజమైనవా కావా అని తెలుసుకోవడం కోసం www.shcilestamp.com వెబ్సైట్లోకి వెళ్లి ఆయా నంబర్లపై తనిఖీ చేసుకోవచ్చని సీపీ సూచించారు. ఈ మేరకు పోలీసులకు సీపీ రివార్డులు అందజేశారు.