సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): యజమానులు చనిపోయినట్లు డెత్, వారసత్వపు, కోర్టు ఆర్డర్లు ఇచ్చినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ నకిలీ మనుషులతో అమాయకుల ప్లాట్లను కొట్టేస్తున్న ఘరాన ముఠాను భువనగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో రూ. 5 కోట్ల విలువైన ప్లాట్లను ఖాళీ చేసేందుకు టెండర్ వేసిన 8 మంది పాత నేరస్తుల ముఠాను పట్టుకోగా మరో 10 మంది పరారీలో ఉన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కథనం ప్రకారం… కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బీగూడెమ్ అరవింద్, సంపంగి సురేశ్, ఈగ హరి ప్రసాద్ రాంపల్లి గ్రామ పరిసరాల్లో ఉండే ఖాళీ ప్లాట్లకు నకిలీ పత్రాలు తయారు చేసి వాటిని కొట్టేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఆ గ్రామ శివారులో బౌండరీలు, ఫెన్సింగ్ లేని ఖాళీ ప్లాట్లను గుర్తించి, వాటికి సర్టిఫైడ్ కాపీలు, ఈసీలు సేకరిస్తారు. అందులో యజమానులు వృద్ధులై ఉండి, ఎవరికీ అమ్మకుండా వాళ్ల పేర్లతోనే ఉన్న వాటిని గుర్తిస్తారు.
వీటికి బాలాపూర్‌కు చెందిన కోట్ల నాగేంద్ర ప్రసాద్ తన గ్యాంగ్ సభ్యులైన సోమనాథ్, మహ్మద్ హుస్సేన్, అహ్మద్‌తో కలిసి నకిలీ పత్రాలు తయారు చేస్తారు. ఆ పత్రాలతో నకిలీ వ్యక్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసికెళ్లి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలా రెండు ప్లాట్లను అమ్మారు. అసలైన ప్లాట్ల యజమానులకు ఈ విషయం తెలియడంతో రిజిస్టార్ ఆఫీస్, పోలీసుల దృష్టికి తీసికెళ్లడంతో ఈ నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టు రట్టయ్యింది.
రాంపల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 281,282,283లో ప్లాట్ నంబరు 267 గజాలు ఉన్న ప్లాట్ నంబర్ 149కు సంబంధించిన యజమాని, అతని భార్య చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేశారు. దీంతో పాటు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో 1985వ సంవత్సరానికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్‌ను తయారు చేశారు.
ఈ ముఠాకు చెందిన వనజ అనే ఒక మహిళ ఆ ప్లాట్‌కు వారసురాలు అని చూపిస్తూ అదే ముఠాకు చెందిన అరవింద్‌కు సబ్ రిజిస్టార్ కార్యాలయం ద్వారా ప్లాట్‌ను విక్రయించారు. ఆ ప్లాట్‌ను మార్కెట్లో విక్రయానికి పెట్టారు. మరో ఘటనలో 200 గజాల ప్లాట్‌కు 1988లో డాక్యుమెంట్ తయారు చేశారు. ఈ ప్లాట్ విషయంలో కోర్టులో సివిల్ కేసు నడుస్తోందని, ఇరువర్గాలు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు ఫేక్ కోర్టు ఆర్డర్‌ను సబ్‌రిజిస్టార్‌కు అందజేసి దానిని ఈ ముఠాకు చెందిన బీగూడెం జనార్దన్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు.
నకిలీ పాస్‌పోర్టు తయారు చేసి..
సర్వే నంబరు 403, 421లో ఉన్న 300 గజాల ప్లాట్‌కు సంబంధించి 1983వ సంవత్సరానికి సంబంధించిన డాక్యుమెంట్ తయారు చేశారు. దానికి యజమానికి సంబంధించిన నకిలీ పాస్‌పోర్టును తయారు చేసి, అతను అమెరికా సిటిజన్ అని, అతడు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈ ముఠాలో వెల్పల్లీ చంద్రశేఖర్‌కు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు తయారు చేశారు.
ఆ నకిలీ పత్రాల ఆధారంగా ఈ ముఠాలోని అమరేందర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ డాక్యుమెంట్లతో మార్కెట్లో విక్రయానికి పెట్టారు. ఈ ప్లాట్‌ను మాజీ ఆర్మీ ఉద్యోగి 1983లో కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఇదే క్రమంలో మరో రెండు డాక్యుమెంట్లను ఈ ముఠా తయారు చేసింది. వీటి విలువ రూ. 5 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
బయటకొచ్చిందిలా…!
అసలైన యజమానులు ఉండగానే వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకొని మార్కెట్లో వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో అసలు యజమానులకు ఈ విషయం తెలిసింది. సబ్ రిజిస్టార్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు అందడంతో పోలీసులకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం కీసర పోలీసులతో కలిసి రంగంలోకి దిగి అరవింద్, సురేష్, హరిప్రసాద్‌లను వారి వారి ఇండ్లలో అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
దీంతో ఈ ముఠాకు సహకరించిన సోమనాథ్, నాగేంద్ర ప్రసాద్, మహ్మద్ హుస్సేన్, యంజాల శేఖర్, వనజలను అరెస్ట్ చేయగా అమరెందర్, మానిక్, అహ్మద్, ముస్క్ సునీలకుమార్తో పాటు మరో ఆరు మింది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుంచి నకిలీ పత్రాలు తయారు చేసేందుకు ఉపయోగించిన 21 రకాలైన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని కీలక నిందితులైన కోట్ల నాగేంద్ర ప్రసాద్‌పై గతంలో నాలుగు కేసులు, సోమనాథ్పై మూడు, ఈగ హరిప్రసాద్‌పై నాలుగు కేసులున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ముఠాపై పీడీయాక్టు పెట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సీపీ తెలిపారు.